షెడ్యూల్ ఏరియాలో లంబాడిలకు ఇల్లు ఎలా కేటాయిస్తారు
– ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షులు కుంజ మహేష్
వెంకటాపురం, అక్టోబర్1, తెలంగాణ జ్యోతి : లంబాడీలు ఎస్టీలు కాదని, షెడ్యూల్ ఏరియాలో వలస వచ్చిన లంబాడి లకు ఇల్లు కేటాయించడం సరికాదని ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్ ప్రశ్నించారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కుంజ మహేష్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. “అర్హత ఉన్న ఆదివాసీలకు ఇల్లు కేటాయించకుండా, వలస గిరిజనేతరులు, లంబాడీలకు పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తు న్నదన్నారు. లంబాడీలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 సవరణ లేకుండా 149 జీ.ఓ. ఆధారంగా ఎస్టీ హోదా పొందినట్టు ప్రకటించడం, ఆ మైనార్టీ వర్గాలకు అదనపు హక్కులు ఇవ్వడం, అసలైన షెడ్యూల్ ఏరియా వాసుల హక్కులను హరించడమన్నారు. మండలం లోని బీసీ మర్రి గూడెం ప్రాంతంలో కొందరు లంబాడీలు ఇల్లు, భూములు కొనుగోలు చేసారని, మైదాన ప్రాంతానికి చెందిన లంబాడీలకు సమానమైన హక్కులు ఉండకపోవడం వల్ల పరిస్థితి ఇబ్బందికరమైందని ఆయన పేర్కొన్నారు. కుంజ మహేష్ మండల పరిషత్ అధికారి లంబాడి మహిళల పేరుతో కేటాయించిన ప్రోసీడింగ్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, గిరిజన ఉప ప్రణాళిక నిధులతో వలస గిరిజనేతరులకు, లంబాడిలకు ఇల్లు కేటాయించడం రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న చర్యగా, స్థానిక ఎన్నికలకు తారాసరూపంగా ఉపయోగపడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఓటు కోసం ఆదివాసీలను ప్రలోభపెట్టడం లేదా బలవంతం చేయడం జరగకూడదని, ఇలాంటి చర్యలు ఎట్రాసిటీ కేసులకు దారి తీస్తాయని హెచ్చరించారు.