అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, మార్చి 26, తెలంగాణజ్యోతి: రాష్ట్రంలో అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల సమస్యపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ హయాంలో ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పేదలు, దళితులు, మైనారిటీలు, బీసీలకు భూములు కేటాయించగా, ప్రస్తుతం వేలాది కుటుంబాలు ఆ భూముల్లోనే నివసిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోనే సుమారు 38 నుంచి 39 వేలమంది ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సభ్యులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో ఒకటి రెండు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూముల్లో ఏర్పడిన నివాసాలపై తీసుకున్న చర్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. అనంతరం అసెంబ్లీలో చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.









