తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్..!
హైదరాబాద్, సెప్టెంబర్ 27, తెలంగాణజ్యోతి :తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. హౌస్‌మోషన్ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ఆమోదం లేకుండానే జీవో ఎలా జారీ చేశారని కోర్టు ప్రశ్నించింది. సంక్షేమం దృష్ట్యా జీవో జారీ చేసామని అడ్వకేట్ జనరల్ వాదించినా, కోర్టు ఏకీభ వించలేదు. చట్టానికి విరుద్ధంగా ఆచరణలోకి తేవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక అంశాల్లో గడువు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లు వేసిందని గుర్తుచేసిన కోర్టు, ఇదే అంశంలో కూడా ఎక్స్‌టెన్షన్ పిటిషన్ వేయాలని సూచించింది. నవంబర్‌లో గాని, మూడు నెలల తర్వాత గాని ఎన్నికలు జరపవచ్చని వ్యాఖ్యానించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో అమలు కాదని స్పష్టం చేసిన హైకోర్టు, సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోమని ప్రభుత్వమే హామీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ఏంటో వివరించాలని అడ్వకేట్ జనరల్‌ను కోరింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ విచారణను అక్టోబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది.