గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి
– అధికారులకు అవగాహన : కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు ప్రతినిధి : రాబోయే గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓ లు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఈ పంచాయతీ ఆపరేటర్లకు జీపీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాను రూపొందించడం పట్ల ఎన్నికలు నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా జీపీ ఓటర్ లిస్టు తయారు చేయడం జరుగుతుందని, ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ టీ పోల్ లో గ్రామపంచాయతీ ఓటర్ జాబితా నుండి వార్డుల వారిగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా చేసేందుకు పూర్తి అవగాహన పెంపొందించు కోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్ హెచ్చరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి సంపత్ రావు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీల కార్యదర్శిలు ఈ – పంచాయతీ ఆపరేటర్ లు పాల్గొన్నారు.