గోదావరిలోకి స్నానానికి వెళ్లి ఒకరి గల్లంతు.
– ముమ్మరంగా గాలింపు చర్యలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన పుప్పాల రాజు (40) గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న రాజు బంధువులు, గ్రామస్తులు గోదావరిలో గజ ఈతగాళ్లు పడవల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లోతు ఎక్కువగా వుండటంతో రాజు మునిగిపోయిన మడుగులో అడుగు పట్టి వున్నట్లు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం పొద్దుపోయే వరకు గజ ఈత గాళ్లు గాలింపు చర్యలలో తెలియరాలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు గోదావరిలో నిలిపివేశారు. ఈ మేరకు వెంకటాపురం పోలీసులకు సమాచారం తో పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. గోదావరి మడుగులో గల్లంతైన పుప్పాల రాజు సతీష్ గడ్ రాష్ట్రం పామేడు ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. సూరవీడులో దశాబ్దాలుగా నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. తమకళ్ళ ముందు ఎల్లవేళలా హుషారుగా తిరుగుతూ ఉండే పుప్పాల రాజు గోదావరి మడుగులోకి స్నానానికి వెళ్లి గల్లంతవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.