వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
– చత్తీస్గడ్ కు రాకపోకలు నిలిచివేత
వెంకటాపురం, ఆగస్టు 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం వాగు గుండా వరదనీరు 163వ జాతీయ రహదారి పైకి చేరి ముంపుకు గురైంది. ఫలితంగా తెలంగాణ–చత్తీస్గడ్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాజేడు తహసీల్దార్, పేరూరు ఎస్‌ఐ, రెవిన్యూ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రహదారిపై ఇరువైపుల వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వెంకటాపురం, వాజేడు మండలాల వాగుల గుండా గోదావరి వరద నీరు చేరుతుండటంతో పల్లపు ప్రాంతాలు క్రమంగా ముంపుకు గురవుతున్నాయి. వెంకటాపురం సమీపంలోని గోదావరి పాయకు మరికాల, దానవైపేట లంకల నుంచి వరద నీరు పాలెం వరకు ప్రవహించి గోదావరిలో కలుస్తోంది. దీంతో దాదాపు 10 కిలోమీటర్ల పొడవునా గోదావరి లంకల మీదుగా రైతుల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది పశువులు పాయదాటి లంకలకు మేతకు వెళ్లకుండా కాపరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.