తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోదావరి
– రెండువందల ఎకరాలకు పైగా మిర్చి తోటలు మునక
వెంకటాపురం, సెప్టెంబర్ 29, తెలంగాణ జ్యోతి : గోదావరి వరద తగ్గుముఖం పట్టినట్టే మళ్లీ ఉధృతి పెరగడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం లోని చండ్రుపట్ల, చెరుకూరు, ధర్మారం, అయ్యవారిపేట పరిసరాల ఆయకట్టులో దాదాపు 200 ఎకరాలకు పైగా మిర్చి తోటలు నీట మునిగిపోయాయి. వేలాది రూపాయలు పెట్టు బడులతో వేసిన మిర్చి పంటలు వరదలతో తరచూ నష్ట పోతుండటంతో మొక్కలన్నీ వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టేకులగూడెం వద్ద రేగుమాకు వంతెనపై వరద నీరు రావడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాకపోకలు నిలిచిపోయాయి. ఒకరోజు వరద తగ్గినా, ఆదివారం ఉదయం నుండి మళ్లీ గోదావరి ఉధృతి పెరిగి, ఎన్హెచ్ 163 జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అలాగే వెంకటాపురం నమీపం పరిధిలోని దానవైపేట, మరికల వద్ద గోదావరి ప్రవాహం పాయ నుండి ఉప్పొంగి లంకల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో మోటర్లు, లేడర్ పైపులు, మల్చింగ్ షీట్లు వరద నీటితో కొట్టుకుపోతాయేమోనని మిర్చి రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇసుక మాఫియా ర్యాంపులు గోదావరి పాయ వద్ద 20 అడుగుల ఎత్తైన ఇసుక తిన్నెలను లారీల్లో తరలించడంతో, ఇప్పుడు స్వల్ప వరదకే గోదావరి పాయలోకి ఉప్పొంగుతోందని రైతులు ఆరోపిస్తు న్నారు. ఆగస్టు నుండి ఇప్పటివరకు ఏడు సార్లు గోదావరి పాయకు నిండు ప్రవాహం రావడం వల్ల మిర్చి సాగు పనులు పూర్తిగా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం, మరిగూడెం, వాడగూడెం, బెస్త గూడెం, చొక్కాల ఉప్పెడు, పాలెం, పాత్రాపురం ప్రాంతాల్లో సుమారు పది వేల ఎకరాలకు పైగా మిర్చి, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతాంగం గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై అనేక చోట్ల వరద నీరు చొచ్చుకురావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.