మిర్చి రైతుల కంట నీరు – శాపంగా మారిన గోదావరి వరదలు
వెంకటాపురం, సెప్టెంబర్30, తెలంగాణ జ్యోతి : గోదావరి వరదలు మిర్చి రైతుల గుండెల్లో బాధ మిగిల్చింది. వరుసగా మూడు సార్లు సంభవించిన వరదలతో మిర్చి నారు, తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల పరివాహక లంకల్లో దుక్కులు దున్ని, బోధేలు తోలి, లేడర్ పైపులు వేసి, మల్చింగ్ షీట్లు పరిచి, మొక్కలు నాటే దశకు రైతులు చేరుకున్నారు. అయితే ఆ సమయానికే గోదావరి ఉద్ధృతంగా పొంగి పొర్లడంతో నారు మునిగి చనిపోయింది. వరద ప్రవాహానికి మల్చింగ్ షీట్లు, లేడర్ పైపులు కూడా కొట్టుకుపోయాయి. వెంకటాపురం శివారు పొట్టి గడ్డ, బూర్గూడెం లంకలలో ఒక ప్రముఖ రైతు నాలుగు కిలోల విత్తనాలతో నారు పండించి, 30 ఎకరాలకు సరిపడే విధంగా మొక్కలు సిద్ధం చేశారు. మొక్కలు నాటే దశకు చేరినప్పుడే సోమవారం ఆకస్మికంగా వచ్చిన గోదావరి వరదలతో నారు నీట మునిగింది. ఫలితంగా సుమారు నాలుగు లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఈ వరదలతో మిర్చి రైతులు లక్షలాది రూపాయలు కోల్పోయారు. గోదావరి మంగళవారం సాయంత్రం నుండి తగ్గుముఖం పట్టినా, రైతుల గుండెల్లో మిగిలిన గాయాలు మాత్రం పెద్దవే. ఆదే సమయంలో గ్రామీణ మహిళలు “గోదారమ్మ తల్లి శాంతించవమ్మా” అంటూ పసుపు, కుంకుమ, పూలను వరద నీటిలో వదులుతూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. మరోవైపు వెంకటాపురం–చర్ల–భద్రాచలం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.