ఇసుక లారీ ఢీకొని నాలుగేళ్ల బాలుడి మృతి
ములుగు, సెప్టెంబర్4,తెలంగాణజ్యోతి: ఆడుతూ కనువిందు చేసే నాలుగేళ్ల బాలుడు తాతయ్యతో బండి పై వెళ్లి ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్రా గ్రామానికి చెందిన వీరబాబు కుమారుడు హర్షవర్ధన్ (4) తన తాతయ్య నర్సింహతో కలిసి గోవిందరావు పేటకు వెళ్లాడు. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇటుక కోసం ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లారు. మనవడిని బండి మీద కూర్చోబెట్టి ఇటుక యజమానితో మాట్లాడుతుండగా బాలుడు బైక్ దిగి తాతయ్య వద్దకు రోడ్డు దాటి వెళ్తుండగా పస్రా వైపు నుంచి హన్మకొండ వైపుకు వెళ్తున్న టీఎస్ 30 టీఏ 888 ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ముక్కు పచ్చలారని బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మరో నెల రోజుల్లో బాలుడి పుట్టిన రోజు జరుగనుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై కమలాకర్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇసుక లారీలు ఆయా గ్రామాల్లో సైతం అతి వేగంతో వస్తున్నాయని, నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు.