గిరిజన మహిళ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు
వెంకటాపురం నూగూరు, మార్చి 22, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామానికి చెందిన రేగ సమ్మక్క అనే ఆదివాసి మహిళ అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మాజీ ఉపసర్పంచ్ బొల్లె మల్లికార్జునరావు, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామానికి చేరుకొని పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పంచక్రియల నిమిత్తం సయ్యద్ హుస్సేన్ రూ.5,000 నగదును కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. గిరిజన సంక్షేమ పథకాల ప్రకారం మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి సహానుభూతి పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.









