బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక–డిజిటల్ అవగాహన
వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ గ్రామీణ బ్యాంకు ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఏ. రత్నాకర్ మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంకు అందించే వివిధ సేవలను సద్వినియోగం చేసుకొని రుణాలు పొందుతూ, సకాలంలో చెల్లించి మళ్లీ రుణాలు పొందాలని సూచించారు. బీమా సౌకర్యాలను వినియోగించు కోవాలని తెలిపారు. జాగృతి ఫౌండేషన్, విజయవాడకు చెందిన కళాజాత బృందం శుక్రవారం ఆటా–పాటల రూపంలో రైతులు, స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించింది. ఆర్థిక అక్షరాస్యత (ఎఫ్‌ఐఎఫ్) సౌజన్యంతో పాటు డిజిటల్ అక్షరాస్యతపై కూడా వివరించారు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యం లో అపరిచిత సందేశాలు, ఓటీపీలను ఎవరికీ చెప్పరాదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానమై ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తదితర బీమా పథకాలపై అవగాహన ఇచ్చారు. ఖాతాదారులకు సేవలందించడమే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యమని, కాలపరిమితి డిపాజిట్ల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని, సీనియర్ సిటిజన్లకు 50 శాతం అధిక వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సుబ్బారావు, క్యాషియర్ శ్రీహర్ష, సిబ్బంది అంబటి నరసింహారావు, బ్యాంక్ మిత్రాలు మల్ల స్వరూపరాణి, ప్రశాంత్, కంతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






