వృద్ధ మహిళపై మహిళా కండక్టర్ దౌర్జన్యం
– కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నారాయణపేట, ఆగస్టు1, తెలంగాణ జ్యోతి: నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ శంకరమ్మ ఓ వృద్ధ మహిళను దూషించడంతో పాటు చెంపపై కొట్టిన ఘటన చోటు చేసుకుంది. మద్దూర్ బస్టాండ్‌లో బస్సెక్కిన 6 గురు మహిళలు, ఇద్దరు పిల్లలు టికెట్ల విషయంలో తలెత్తిన వివాదానికి ఇది కారణమైంది. కండక్టర్ అడిగిన ఆధార్ కార్డులు ఇవ్వగా, అందులో మూడు చెల్లవని తిరిగి టికెట్లు తీసుకోవాలని సూచించడంతో వారు నారాయణపేట టికెట్లు తీసుకున్నారు. అనంతరం తమ ఆధార్ కార్డులు తిరిగి ఇవ్వమని అడగగా, కండక్టర్ శంకరమ్మ కోపంతో నరసమ్మ అనే వృద్ధ మహిళ జుట్టు పట్టుకుని చెంపపై కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై భారతీయ కిసాన్ సంఘం పట్టణ అధ్యక్షుడు ఆకుల వెంకటప్ప డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాత్రి 9 గంటలకు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. అయితే, రాత్రివేళ దామరగిద్ద పోలీస్ స్టేషన్‌కు మహిళలను తీసుకెళ్లి వదిలిన నేపథ్యంలో వారు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై భారతీయ కిసాన్ సంఘం నగర అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా సహకారదర్శి ప్రభు మీస్కిన్, నాయకులు లక్ష్మీనారాయణ, బండకొండ రవి తదితరులు పాల్గొని కండక్టర్ శంకరమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరారు.