నాంచారమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించాలి
ములుగు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మే 1 నుంచి జరగబోయే నాంచారమ్మ జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో లోకిని రాజు మాట్లాడుతూ 800 ఏళ్ల చరిత్ర కలిగిన నాంచారమ్మ ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుంచి ఎరుకల సంఘం ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నామని, ఈసారి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్ వంటి ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ జాతరకు వేలాది భక్తులు తరలివస్తారని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కోనేటి రాజు, మానుపాటి రమేష్, పల్లకొండ ఎల్లస్వామి, పాలకుర్తి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.









