రేపటి బంద్‌కు అందరూ సహకరించాలి
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 17, తెలంగాణ జ్యోతి : బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బంద్‌కు మద్దతుగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నుంచి విస్తృత ప్రచారం చేపట్టాయి. వెంకటాపురం పట్టణ ప్రధాన మార్కెట్ సెంటర్లలో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంఘాలకు రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేసేందుకు స్వచ్ఛందంగా పాల్గొంటామని వ్యాపార, వాణిజ్య సంస్థలు సంఘీభావం వ్యక్తం చేశాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మరియు రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ బీసీల న్యాయ హక్కుల సాధన కోసం ఈ బంద్ చారిత్రాత్మకంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.