పారిశుద్ధ్య మెరుగని ఏటూరునాగారం గ్రామపంచాయతీ
ఏటూరునాగారం,ఆగస్టు13,తెలంగాణజ్యోతి: గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం అనే పదాలు ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీకి దూరమైనట్లుగా మారాయి. ప్రధాన రహదారులపై చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నా, గ్రామపంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం అనే చల్లని దుప్పట్లో నిద్ర పోతున్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్, మండల అధికారులు హెచ్చరించినా, కార్యదర్శి, సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు లేదు. సైడు కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండి, దోమలు విపరీత పెరుగుదలతో గ్రామ ప్రజలు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ముందస్తు చర్యలుగా దోమల మందు పిచికారి చేయడమే కాక, చెత్త సకాలంలో తొలగించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలతో తల్లడిల్లుతున్నారు. రోడ్లు ఊడ్చే పనులు కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. వ్యాపారుల సముదాయాల ముందు మాత్రమే శుభ్రం చేసి, ప్రతినెల డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి లాభాలు గట్టిపడుతున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా రహదారుల దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హెచ్చరించినా పరిస్థితి యధా విధంగా కొనసాగుతోంది. అధికారుల ఇష్టానుసార పరిపాలన సాగుతుండటంపై ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగుతోంది. ప్రభుత్వం వెంటనే మేల్కొని విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం పట్ల సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.