వెదురు కోసం వెళ్లిన వృద్ధుడికి ప్రెషర్ బాంబు దెబ్బ
వెంకటాపురం, జూలై4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరు పాలెం గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు, వృద్ధుడు సోయం కామయ్య వెదురు బొంగులు కోసం సమీప అటవీ ప్రాంతం కొండల్లోకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అడవిలో మావోయిస్టులు పాతిపెట్టిన ప్రెషర్ బాంబు పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బాంబు పేలుడుతో కామయ్య కాలు విరిగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి స్థానిక గ్రామస్తులు హుటాహుటిన చేరుకొని అతడికి ప్రాథమికంగా చికిత్స అందించి, 108 అంబులెన్స్ సాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల కగార్ ఆపరేషన్ అనంతరం అడవుల్లో ప్రెషర్ బాంబులు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.