గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు : ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట, ఆగస్టు3, తెలంగాణ జ్యోతి : మల్టీ లెవెల్ మార్కెటింగ్ (చైన్ సిస్టం) వ్యాపారాల పేరుతో అమాయకుల డబ్బులు దోచుకుంటున్న మోసగాళ్ల జోలికి ప్రజలు పోకూడదని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాతో ప్రజలను మోసం చేస్తారని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా తక్కువ సమయంలో అధిక లాభాలు, “ఎక్కువ మంది ఏజెంట్లను చేర్పించి రివార్డులు పొందండి”, “లగ్జరీ కార్లు – విదేశీ పర్యటనలు” అనే మోసపూరిత వాగ్దానాలతో జనాలను ఆకట్టుకుంటున్న గొలుసుకట్టు వ్యాపారాలు పెరిగి పోతున్నాయని ఎస్పీ తెలిపారు. మొదట్లో చేరిన కొద్దిమందికి లాభాలు వచ్చినట్టు చూపించి, తరువాత చేరినవారిని తీవ్రంగా నష్టపోయేలా చేస్తున్నారన్నారు. ఇలాంటి మల్టీ లెవెల్ వ్యాపారాల సమావేశాలకు వెళ్లవద్దని, వాటిని నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని వివరించారు. సోషల్ మీడియా ప్రకటనలపై అనుమానంగా ఉన్నా, ఎలాంటి వెబ్ లింకులు, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయరాదని, అవసరమైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. “అత్యాశను వదిలితే మోసాలు దూరంగా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది తమ ప్రయత్నమని ఎస్పీ పేర్కొన్నారు.