స్కూల్స్, కాలేజీలకు వంద మీటర్ల పరిధిలో మత్తు పదార్థాలు అమ్మొద్దు
– విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు
– ఎస్పీ డాక్టర్ పి.శబరీష్
ములుగు ప్రతినిధి, జూన్23, తెలంగాణ జ్యోతి : విద్యా సంస్థలకు 100మీటర్ల దూరంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దని, ఒకవేళ విక్రయిస్తే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల యాక్ట్ సీవోటిపీఏ చట్టం 2003, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్ల సమీపంలో వ్యాపారులు పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధమని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువత, ప్రజలను మమేకం చేస్తూ మత్తు మాదకద్రవ్యాల పై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఉండేందుకు గాను విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు, మద్యం విక్రయించకుండా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు మీరినట్లయితే అట్టి దుకాణాలు లేదా వ్యాపార సముదాయాల పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.