షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలపై భూ వివాద కేసులు పెట్టకండి

షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలపై భూ వివాద కేసులు పెట్టకండి

షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలపై భూ వివాద కేసులు పెట్టకండి

వెంకటాపురం, జులై 4, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివాసీ భూ హక్కుల పరిరక్షణకు సంబంధించి వినతులు, సమస్యలు మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాల్లో భూ వివాదాల నేపథ్యంలో అమాయక ఆదివాసీ రైతులపై పోలీస్ కేసులు నమోదు చేయవద్దని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతి రావుకు వినతిపత్రం అందజేశారు. కోనేరు రంగారావు సిఫారసుల ప్రకారం డీజీపీ కార్యాలయం విడుదల చేసిన సర్క్యులర్ కాపీని కూడా మెమోరాండంతో పాటు సమర్పిం చినట్టు ఆయన తెలిపారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో 1/70, పేసా వంటి చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, కొంతమంది గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా ఆదివాసీల భూములను ఆక్రమించేందుకు చూస్తున్నారని వివరించారు. గిరిజనేతరులు పట్టాలు కలిగి ఉన్నంత మాత్రాన వారికి హక్కులు లభించవని, ఆ భూములు చట్టబద్ధమైనవా కాదా అనేది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టు నిర్ణయించే విషయమని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక బలం కలిగిన వలస గిరిజనేతరులు, విద్య లేని అమాయక ఆదివాసీలపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. కోనేరు రంగారావు నివేదిక ప్రకారం దాదాపు 8,700 ఎకరాల గిరిజనుల సాగుభూములు అన్యాక్రాంత మైనట్లు కమిషన్ నివేదికలో పేర్కొనబడిందని చెప్పారు. సివిల్ వివాదాల నేపథ్యంలో గిరిజనులపై ట్రెస్పాస్ కేసులు నమోదు చేయరాదని, భద్రాచలం ఐటిడిఏ ఏ ప్రాజెక్టు అధికారి వి.పి. గౌతమ్ ఐఏఎస్ విడుదల చేసిన ప్రత్యేక సర్క్యులర్‌ను ఉద్ధరిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీ కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు. ఏవైనా భూ వివాదాలు ఉంటే ప్రజలు నేరుగా మండల మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లాలని, పోలీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం వెంకటాపురం ప్రభుత్వ విశ్రాంతి భవనంలో రైతులతో సమావేశం నిర్వహించి, అంకన్నగూడెం ప్రాంతంలో వలస గిరిజనేతరుడు ఆదివాసీ రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని బాధితుల ఆవేదన విన్నారు. ఎప్పుడూ భూమిపై పని చేయని వలస గిరిజనేతరుడు పదుల సంఖ్యలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని స్థానిక ఆదివాసీలు ఆరోపిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా వలస గిరిజనేతరులకు పట్టాలు ఇస్తూ ఉన్నారని విమర్శించారు. గిరిజన, గిరిజనేతరుల మధ్య భూ సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎస్ జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్, అంకన్నగూడెం రైతులు మిడెం లక్ష్మయ్య, బొగ్గుల సురేష్, ఇతర గ్రామ రైతులు, ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు.

షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలపై భూ వివాద కేసులు పెట్టకండి

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment