విద్యార్థుల ప్రగతిని పరిశీలించిన జిల్లా విద్యాధికారి
వెంకటాపురం, అక్టోబర్ 16, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించి, ప్రార్థనా సమయంలో హాజరయ్యారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల ప్రగతి పత్రాలు, మార్క్ రిజిస్టర్‌లు పరిశీలించి, ప్రతి విద్యార్థి స్లిప్ టెస్ట్ ఫలితాల ఆధారంగా గ్రేడులను గుర్తించాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన విద్యాధికారి, వారి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆంగ్లం, గణితం పట్ల ఉన్న సామర్థ్యాలను పరీక్షించారు. స్వయంగా భౌతిక శాస్త్ర పాఠ్యాంశాన్ని బోధించి, విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. వంట కారిణులతో మాట్లాడి, ప్రతిరోజు మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారం వండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జీ.వి.వి. సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.