సామాజిక వైద్యశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఏటూరునాగారం, జులై 5, తెలంగాణ జ్యోతి : వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల ప్రబలతను దృష్టిలో పెట్టుకుని ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ నుంచి వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలు, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే సీజన్లో పేషెంట్ల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అన్ని రకాల మందులు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, ప్రజలకు తక్షణ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యసేవలను అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టంగా తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.