రాళ్ళవాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర
వెంకటాపురం,జులై23,తెలంగాణజ్యోతి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి జిల్లా,మండల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యాకన్నగూడెం వద్ద ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఉన్న రాళ్లవాగు వంతెనను కలెక్టర్ దివాకర్ టి.ఎస్. పరిశీలించారు. ఇది ఇటీవల భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 3 రోజులపాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశముందని, వాగులు, వంకలు, చెరువులు, పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపైకి నీరు చేరినపుడు ప్రజలు, వాహనదారులు అనవసరంగా ప్రయాణించవద్దని హెచ్చరించా రు. గోదావరి ముంపు ప్రాంతాల్లో నివాసముండే ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎటూరునాగారం వద్ద రెస్క్యూ బోటు టీమ్ సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. అలాగే గర్భిణీలను సమీప ఆసుపత్రులకు తరలించాలని, వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, తహసీల్దార్ వేణు గోపాల్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, మండల అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.