పాతర్చేడ్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు
– సీసీ రోడ్లు, ఇండ్ల మంజూరుతో ప్రజల్లో హర్షం
నారాయణపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి : మక్తల్ నియోజకవర్గం లోని నర్వ మండలానికి చెందిన పాతర్చేడ్ గ్రామంలో అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి శ్రీహరి అన్నారు. గ్రామానికి రూ.28 లక్షల నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు, మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీహరి మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ప్రజలు ప్రశ్నిస్తే గొంతు నొక్కే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కును కల్పించిందని తెలిపారు. పాతర్చేడ్‌ను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పౌర సంక్షేమాన్ని ప్రాముఖ్యతగా తీసుకొని పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే పాతర్చేడ్ గ్రామానికి 20 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేసినట్టు, వాటిలో ఎస్సీ వర్గానికి 5 ఇండ్లు కేటాయించామని వివరించారు. అదనంగా మరో 20 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని తెలిపారు. ఈ ఇంటెల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు అని భరోసా ఇచ్చారు.“కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం. వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోంది,” అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, జగదభి రెడ్డి, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.