యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం: మంత్రి సీతక్క
జీవన శైలిలో యోగ ఒక భాగంగా అలవర్చుకోవాలి.
ములుగు, ఏప్రిల్ 10, తెలంగాణ జ్యోతి: యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, రోజువారీ జీవనశైలిలో యోగను భాగంగా అలవర్చుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా బండారుపల్లి గిరిజన భవన్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ 271వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రపంచ హోమియోపతి (ఆయుష్ డే) యోగ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు యోగ చేయడం వల్ల శరీరం, మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. యోగాసనాలకు ప్రాచీన కాలం నుంచే ప్రాముఖ్యత ఉందని, సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలమన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం 45 నుంచి 50 నిమిషాల యోగా, వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఉపశమనం పొందవచ్చని తెలిపారు. వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకోవడం అవసరమన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్, అధికారులు, ఆయుష్ సిబ్బంది, క్రీడాకారులు కలిసి యోగాసనాలు చేసి పాల్గొన్న వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాలరావు, కౌన్సిలర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









