గడ్డిమందు పారాక్వాట్పై పూర్తి నిషేధం.. జీవో 24 విడుదల…
ప్రమాదకర ప్రభావాల నేపథ్యంలో కఠిన నిర్ణయం
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 7, తెలంగాణ జ్యోతి: రాష్ట్రంలో ప్రమాదకరంగా గుర్తించబడిన పారాక్వాట్ గడ్డిమందుపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో నంబర్ 24ను విడుదల చేస్తూ, ఈ మందు తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ మరియు అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ శాఖ చేసిన పరిశీలనల ప్రకారం పారాక్వాట్ మందు తక్కువ మోతాదులోనే వాడినా మానవ శరీరానికి తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉందని, ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందని వెల్లడైంది. అంతేకాకుండా ఈ మందు వినియోగంతో పండించే కూరగాయలు, పంటలు విషపూరితంగా మారే అవకాశముండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ మందు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్రత్యామ్నాయ సురక్షిత గడ్డిమందులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.









