మురుమూరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
- చీకుపల్లిలో వాహనాల తనిఖీలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం మురుమూరు గ్రామంలో ఆదివారం వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో మురుమూరు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి వచ్చే అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల మాయమాటల వలలో పడవద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ యువత విద్య , ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని కోరారు. అలాగే అనేక భద్రతాపరమైన అంశాలతో పాటు, సైబర్ క్రైమ్ నేరాలు, ఇతర సంక్షేమ అంశాలు, గ్రామ ఆదివాసులకు ఎస్సై వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉన్న చీకుపల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు , అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు క్షుణ్ణంగా తనిఖీలు కార్యక్రమంలో భాగంగా ప్రతి వాహనదారుడు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని రోడ్డు భద్రత ప్రయాణ అంశాలపై వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు ఇంధన శకట దారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీస్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం తో పాటు, వాహనాలు తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.