Collector | సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు వెన్నుముక
– కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, జులై 8, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని గనుల వృత్తి శిక్షణా కేంద్రంలో మంగళవారం నిర్వహిస్తున్న లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడిన ఆయన శిక్షణా తీరును అడిగి తెలుసు కున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే విషయంలో సంపూర్ణ అవగాహన అవసరమని, భూ సమస్యల పరిష్కారా నికి సర్వే చాలా కీలకమని, శాస్త్రీయంగా భూమి హద్దులు నిర్దేశించడంలో సమగ్రమైన శిక్షణ అవసరమని తెలిపారు. భూ కొలతలు, బౌండరీలు, వివాదాల నివారణలో సర్వే ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్న ఆయన, సర్వే విషయంలో ప్రతి అంశంపై అభ్యర్థులు స్పష్టమైన అవగాహనను పెంచు కోవాలన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ అభ్యర్థుల సామర్థ్యాన్ని మెరుగు పరచడంలో దోహదపడుతుందని, భవిష్యత్తులో పటిష్టమైన సర్వే నిర్వహణకు వీరు ఆధారంగా నిలవాలన్నారు. జిల్లాలో మొత్తం 162 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, మొదటి విడతలో ఎంపికైన 87 మందికి మే 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమైందని తెలిపారు. శిక్షణా కాలం 50 పని రోజులు ఉంటుందని, ఉదయం తరగతులతో పాటు సాయంత్రం క్షేత్రస్థాయిలో భూమి కొలతల శిక్షణ నిర్వహిస్తున్నామని, ఈ నెల 28, 29 తేదీలలో ఫీల్డ్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏ.డి. కుసుమ కుమారి, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లు గంగాధర్, గణేశ్ యాదవ్, రాములు, టెక్నికల్ సిబ్బంది పరమేష్ తదితరులు పాల్గొన్నారు.