కోస్గి ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
– సౌకర్యాల లోపంపై అధికారులు చర్చ
నారాయణపేట, జూలై 29, తెలంగాణజ్యోతి: నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాల తరగతులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కళాశాల నిర్వహణ, తరగతి గదుల కొరత, ఫ్యాకల్టీ అభావం వంటి సమస్యలపై ప్రిన్సిపాల్ శ్రీనివాసులుతో కలెక్టర్ గంట పాటు చర్చించారు. రాబోయే రెండవ సంవత్సరం తరగతుల ప్రారంభానికి ముందు అవసరమయ్యే అదనపు గదులు, ల్యాబ్స్, కంప్యూటర్లు, బాలికల హాస్టల్ తదితర సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఖాళీగా ఉన్న గదులను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు. తర్వాత సర్వే నంబర్ 1737లోని 10.08 ఎకరాల్లో నిర్మించబోయే శాశ్వత ఇంజనీరింగ్ కళాశాల స్థలాన్ని, అలాగే సర్వే నంబర్లు 1809, 1811, 1812లోని 7 ఎకరాల్లో నిర్మించబోయే మహిళా డిగ్రీ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్శనలో తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, పంచాయతీరాజ్ డీఈ విలోక్, ఆర్అండ్‌బీ డీఈ రాములు తదితర అధికారులు పాల్గొన్నారు.