పీఎం శ్రీ గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌కి కలెక్టర్ ప్రశంసలు
ములుగు ప్రతినిధి, జూలై 29,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా బండారుపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్ పీఎం శ్రీ పథకంలో జిల్లాలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా జిల్లాకలెక్టర్ దివాకర టీ.ఎస్. సోమవారం పాఠశాలలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలకు మంజూరైన నిధులను సక్రమంగా వినియోగిస్తూ విద్యార్థుల కోసం మెరుగైన విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో పాఠశాల విజయం సాధించిందని ప్రశంసించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించే దిశగా విద్యా సంస్థలు ముందడుగు వేయాలని సూచించారు. చైర్మన్ బానోత్ రవిచందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయంగా చూసుకుంటుండటంతో రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించ బడుతున్నాయని తెలిపారు. ఇది ములుగు వంటి వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కోసం మంజూరైన సంగీత పరికరాలను కలెక్టర్, చైర్మన్ కలిసి విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ అర్షం రాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.