కోటకొండ పిహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నారాయణపేట, జూలై 30, తెలంగాణజ్యోతి : నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపి (ఔట్ పేషెంట్) సంఖ్య తక్కువగా ఉండడం గమనించిన కలెక్టర్, అక్కడి డాక్టర్‌ను వివరణ కోరారు. ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిజీజ్) ప్రోగ్రామ్ గురించి అడిగి తెలుసుకున్న ఆమె, ఈ డీ డీ (డెలివరీలు) సంఖ్య ఎంత ఉందని ప్రశ్నించారు. దాదాపు 6 వేలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో గత మార్చి, ఏప్రిల్ నెలలో ఒక్క డెలివరీ కూడా జరగలేదని రిజిస్టర్‌లను పరిశీలించి తెలుసుకున్నారు. జూలై నెలలో కేవలం రెండు డెలివరీలు మాత్రమే జరిగాయని తెలుసుకున్న కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. పి హెచ్ సీ పరిధిలోని 10 సబ్ సెంటర్లకు 16 మంది డాక్టర్లు ఉండగా, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎందుకు సందర్శించలేదని కలెక్టర్ ప్రశ్నించారు. అలాగే, ఏఎన్‌సీ (ఆనిమాల్స్ న్యూట్రిషన్ కేర్), టీబీ, ఎన్‌సీడీ కార్యక్రమాల పరిస్థితేంటని ఆమె సవాలు చేశారు. ప్రతీ గురువారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నా, ఆ టాబ్లెట్లు ప్రజలకు అందించడం ఎందుకు జరగడం లేదని కలెక్టర్ తీవ్రంగా ప్రశ్నించారు. తనిఖీ సమయంలో ఆస్పత్రి రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడంపై వైద్య సిబ్బందిని నిలదీశారు. సూపర్‌వైజర్ ద్వారా రిజిస్టర్లు పొందడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వైద్య సేవల ప్రామాణికత పై ప్రశ్నలు సంధించారు. పనితీరు మార్చుకోవాలని వైద్య సిబ్బందికి సున్నితంగా హెచ్చరించిన ఆమె, కోటకొండ గ్రామంలో శీలంరాజేశ్వరి అనే లబ్ధిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని పరిశీలించారు. గ్రామానికి మొత్తం 31 ఇండ్లు మొదటి విడతలో మంజూరు కాగా, 28 ఇండ్లు గ్రౌండింగ్ స్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.