Collector | ఎక్కెల గ్రామంలో ప్రభుత్వ భూముల పరిశీలన
– ఏటూరునాగారంలో వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
– వన సంరక్షణ సమితులపై రైతులకు అవగాహన కార్యక్రమం
ఏటూరునాగారం, జూలై8,తెలంగాణజ్యోతి : మండలం లోని ఎక్కెల గ్రామంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గోదావరి నది ముంపు ప్రాంతమైన భూటారం పరిసర గ్రామస్తులకు నివాస స్థలంగా కేటాయించేందుకు అనుకూలమైన భూములపై పరిశీలన జరిపి, పూర్తి నివేదికను తహసీల్దార్ తక్షణమే సమర్పించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ఫారెస్ట్ నర్సరీ ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్, ఏటూరు నాగారంలో వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు కోసం భూమిని సర్వే చేసి, పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, చిన్నబోయినపల్లి గ్రామం సర్వే నం.98 పరిధిలో అటవీ భూమిలో సాగు చేస్తున్న రైతులకు ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వడం సాధ్యపడకపోవడంతో వారి ప్రయోజనార్థం వన సంరక్షణ సమితుల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 70 మంది రైతులకు వన సంరక్షణ సమితుల ద్వారా లభించే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, తహసీల్దార్ జగదీశ్వర్, ఎం.పి.ఓ, ఆర్.ఐ తదితర అధికారులు పాల్గొన్నారు.