Collector ila Tripathi | ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం
– జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి.
ఏటూరునాగారం ప్రతినిధి : ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం అని, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పిఓ,ఏపిఓ,ఓపిఓలు సమన్వయంతో ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారిణి కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై మాస్టర్ ట్రైనర్స్ చే రెండవ రోజు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రిటర్నింగ్ అధికారి ఐటిడిఏ పిఓ అంకిత్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అందుకు కావాల్సిన అన్ని విషయాలపై అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ చే శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కు ఒకరోజు ముందు, పోలింగ్ రోజు,పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, విధులు ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలని, ఎన్నికల నిబంధన ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభానికి (90) నిమిషాల ముందు అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్, చనిపోయిన వారి వివరాలు, తదితర వివరాలను మార్క్ చేయబడి ఉంటుందని ఓటు వేయడానికి వచ్చే ఓటరు వద్ద నుండి మొదటి ప్రాధాన్యత ఎపిక్ కార్డు తో (12) రకాల ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులను వినియోగించు కోవచ్చన్నారు. పోలింగ్ కు ఒక రోజు ముందు పోలింగ్ సామాగ్రి తీసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రంలో కావలసిన ఏర్పాట్లను అన్ని పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి ప్రతి విషయాలు బుక్ లెట్ రూపంలో అందించడం జరిగిందని తెలిపారు. రెండవ రోజు 382మంది హాజరు అయ్యారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో పానిని, సిపిఓ ప్రకాష్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ జయదేవ్, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.