Cm kcr | నాగజ్యోతి గెలుపే ములుగుకు జ్యోతి : సీఎం కేసీఆర్
– ములుగు ఎమ్మెల్యే అభివృద్ధి పనుల కోసం ఏనాడు రాలేదు.
– కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాలు పాలు ఖాయం.
– అన్ని ఇచ్చిన బిఆర్ఎస్ కావాలో.. ఏమివ్వని కాంగ్రెస్ కావాలో ఆలోచించండి…
– కరెంట్ కోతలతో ముప్ప తిప్పలు పెడుతారు.
– ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు,కాల్చి సంపుడే కదా.
– ఉద్యమకారుల బిడ్డ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించండి
– ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 24, ములుగు ప్రతినిధి : బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు పట్టణంలోని తంగేడు స్టేడియంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన కెసిఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో కష్టాలు కన్నీళ్లు తప్ప అభివృద్ధి జరగలేదని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అని రంగాల్లోనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామన్నారు. ఇక్కడ కొన్ని పనులు కావాల్సి ఉన్నది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక, తప్పకుండా ముఖ్యమంత్రిని కలసి, గవర్నమెంట్లో ఉన్నవాళ్లతో మాట్లాడాలి. మీ ఎమ్మెల్యే ఎన్నడూ రాలే, ఏం అడగలే, మాకు తోచినవి.. తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ ఎది అడుగదు. ఏం చేసిర్రు మీరు అంటే.. ఏం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీరు, కరెంటు, రైతుబంధు ఇచ్చార అని ప్రశ్నించారు. మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం. కాంగ్రెస్ కాలంలో పోడు భూములు పంచారా, ఇవాళ మేం పంచినం కదా.. ప్రజల క్షేమం కోసం ఏరోజైనా ఆలోచించేది మేమన్నారు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీ పెట్టి జైళ్లలో వేసుడు, ఓ బానిస బతుకుల్లా ఉండేదని అన్నారు. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండని గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండని, ఆయన స్వార్థం కోసం బలి కాలేదని, ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారన్నారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసన్నారు.
తల్లిలేదు తండ్రి లేడు.. ములుగు ప్రజలే నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చిందన్నారు. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుందన్నారు. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్ లో ఉండి స్వయంగా మీతోని మాట్లాడి, ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉండేది. 47 వేల పైచిలుకు పోడు భూముల పట్టాలు ఇప్పటివరకు పంపిణీ చేసామన్నారు. గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజ కవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. కాంగ్రెస్ ది ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు, అది వచ్చేది లేదు. సచ్చేది లేదన్నారు. పోయిన ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించకుంటే నేను మీ మీద అలుగ లేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా నని అన్నారు. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగతయని పేర్కొన్నారు. నాగజ్యోతి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది కుటుంబ త్యాగాలు మీకు తెలుసు అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసినపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ములుగు ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేశామని, ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ఇచ్చామన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ లకు తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నోసార్లు మొక్కుకు న్నామని గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తదని ఎప్పుడైనా ఊహించారా.. మెడికల్ కాలేజీ అంటే 400 పడకల ఆసుపత్రి, దాంతో నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కోర్సులు వచ్చి బ్రహ్మాండమైన వైద్య సదుపాయాలు ఇక్కడే అందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని కోరారు.
ఈ సమావే శంలో బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అడుగుజాడల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నా రు. ఈరోజుల్లో ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే కోట్ల రూపాయలు ఉన్నవారికి సాధ్యమవు తుందని, నిరుపేద బిడ్డ అయిన మీ నాగ జ్యోతికి అవకాశం ఇచ్చిన కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా తనను గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తపనపడే కేసీఆర్ ఆలోచనల నుంచి సంక్షేమ పథకాలు పుట్టుకొస్తాయని అన్నారు. పేద ప్రజల కోసం పోరాటం చేసి అమరులైన తల్లిదండ్రులు లేకున్నా మీరంతా నన్ను బిడ్డలా ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ,మాజీ ఎంపీ సీతారాం నాయక్ ,ములుగు జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణరావు, కార్పొరేషన్ చైర్మన్లు సతీష్ రెడ్డి,మెట్టు శ్రీనివాస్,ప్రకాష్ రావు, వరంగల్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ సాంబరావు, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, సీనియర్ నాయకుడు,ధరమ్ సింగ్, తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు గోపాల్ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, లతో పాటు తదితర నాయకులు ఉన్నారు.