పిల్లల ఆరోగ్యమే ములుగు అభివృద్ధికి పునాది
బాల్య వివాహాలపై కఠిన చర్యలు : ఐసిడిఎస్ అధికారి ముత్తమ్మ
వెంకటాపురం (నూగూరు), మార్చి 17 (తెలంగాణ జ్యోతి): పిల్లల ఆరోగ్యమే ములుగు అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, పోషకాహార లోపం లేని ములుగు జిల్లాను నిర్మించడమే లక్ష్యమని, బాల్య వివాహాలపై కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్ వెంకటాపురం అధికారి ముత్తమ్మ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ కింద మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు పోషణ్ 2.0, బాల్య వివాహం–బతుకు ఆగం అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని, అంగన్వాడీ టీచర్లపై కీలక బాధ్యత ఉందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీల పనితీరును మెరుగుపర్చేందుకు ఏఎల్ఎంఎస్ కమిటీలు ఏర్పాటుచేసి “అమ్మ మాట–అంగన్వాడీ బాట” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. లోప పోషణతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారికి సరైన పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పర్యవేక్షణలో, రాష్ట్ర మంత్రి సీతక్క నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోషకాహార లోపం లేని జిల్లాగా ములుగును తీర్చిదిద్దడం సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం డీసీపీవో ఓంకార్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు కీలకంగా పనిచేస్తాయని, 1098/112 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సఖి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పోస్టర్లను సిడిపిఓ ముత్తమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






