బోధాపురం పాఠశాల సమస్యలపై రోడ్డుపై చిన్నారుల ధర్నా
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలోని ఒంటిపూట బడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈనెల 10న మంత్రి సీతక్క పర్యటన సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకొని సమస్యలను విన్నవించగా, మూడు నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తామని కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు మళ్లీ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న ఈ పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా రహదారికి ఇరువైపులా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మండుటెండలో చిన్నారులు చేసిన ఆందోళనపై అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరగా, విద్యార్థులు “మాకు న్యాయం చేయాలి, మాకు టీచర్ కావాలి” అంటూ నినాదాలు చేశారు. అధికారులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.









