కెనరా బ్యాంక్ సిబ్బంది చేతివాటం – వార్షిక ఆడిట్ లో గుర్తింపు
– రూ.1.44 కోట్ల విలువైన రెండు కిలోల తాకట్టు బంగారం మాయం ?
– ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ ఉన్నతాధికారులు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం బ్యాంకు సిబ్బంది చేతివాటంతో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… రాజుపేట కెనరా బ్యాంక్ శాఖ పరిధిలోని వందలాది మంది తమ అవసరాలు నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులో ఉన్నటువంటి సుమారు రూ.1.44 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల 117 గ్రాముల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ తన చాకచక్యంతో కొట్టేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంకు శాఖలో ఇటీవల వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఖాతా దారులు గత ఏడాది తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు సదరు నిల్వలకు తాకట్టు లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో ఈ విషయాన్ని ఆడిట్ అధికారులు బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళగా… బ్యాంకు మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినా, ఆయన అప్పటికే గ్రామం నుంచి కుటుంబంతో సహా ఉడాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రెండు రోజుల క్రితం స్థానిక మంగపేట పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.ఇన్ని రోజులు తాము తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో ఉందని ప్రశాంతంగా ఉన్న వినియోగదారులు ఈ సంఘటన బయటకు పొక్కడంతో ఆందోళన చెందుతున్నారు.