పిడుగుపాటుకు పశువుల కాపరి దుర్మరణం
వెంకటాపురం, అక్టోబర్10, తెలంగాణజ్యోతి: ములుగుజిల్లా వెంకటాపు రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన ముర్రం సమ్మయ్య (46) అనే పశువుల కాపరి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తన పశువులను గ్రామ పరిసరాల్లో మేస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు సమ్మయ్యపై పడి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. శరీరమంతా బొబ్బలు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను తొలుత చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందారు. ఈ ఘటనపై వెంకటాపురం ఎస్‌ఐ కే. తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ముర్రం సమ్మయ్య మృతి చెందటంతో కొండాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.