ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు
కోర్టు ఆవరణలో బాంబు ఉన్నట్టు మెయిల్ పంపిన దుండగుడు
ములుగు, మార్చి 23, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కళకలం రేగింది. పోలీసులకు సమాచారం అందించి కోర్టులో ఉన్న జడ్జిలు, న్యావాదులు, కోర్టు సిబ్బంది అందరూ బయటకు పరుగుతీశారు. ప్రశాంతంగా ఉండే ములుగులోని కోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్ ద్వారా ఆగంతకుడు సమాచారం అందించడంతో కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఎవరినీలోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కొద్ది నిమిషాల్లోనే కోర్టు పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో అణువణువూ సోదాలు నిర్వహించారు. కోర్టు పరిసర ప్రాంతాలతోపాటు మూడు అంతస్థలు భవనంలోని ప్రతీ గదినీ క్షున్ణంగాపరిశీలించారు. రికార్డ్ గదులు, కోర్టు హాళ్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏ మూలను వదలకుండా సోదాలు నిర్వహించారు. గంటల పాటు సాగిన తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఫేక్ మెయిల్ అని ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ బాంబు కలకలం కారణంగా కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. విచారణకు వచ్చిన కేసులను వాయిదా వేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పోలీసు అధికారులు హెచ్చరించారు. కాగా, నిందితుడు ఎవరనేది ఎతలియలేదని, ఈ సంఘటనపై విచారణ చేపట్టామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ రావు వెల్లడించారు. అయితే బండారుపల్లి రోడ్డులో ఉన్న పాత కోర్టు భవన సముదాయాన్ని 1996లో మావోయిస్టులు పేల్చిన ఘటనను స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కోర్టులకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపుతున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రాగా ఆ ఘటన మరువకుమందే సోమవారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చరిక రావడం కలవరపెడుతోంది










