సీజీ గొత్తి కోయ బాలికపై బీజేపీ నాయకుడి అసభ్య ప్రవర్తన
– కేసు నమోదు చేసిన పోలీసులు
వెంకటాపురం(నూగూరు),తెలంగాణజ్యోతి: మిరపకాయలు కోయటానికి కూలీ పనికి వలస వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈమేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షడు రామెళ్ళ రాజశేఖర్ పై వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెంకటాపురం ఎస్సై కె.తిరుపతిరావు మీడియాకు తెలిపారు. సదరు బాలిక మిరపకాయలు కోయడానికి ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి తమ గ్రామస్తులతో కలిసి తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి వలస వచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే రామళ్ల రాజ శేఖర్ బాలికకు మాయ మాటలు చెప్పి అడవి లోకి తీసుకు వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదులో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.