ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం, జూలై 2, తెలంగాణ జ్యోతి : ప్రజలకు అందుబాటు లో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా లోని టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పని తీరు, సమస్యలుపై ఆరా తీశారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కేటాయించిన విధుల ను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, స్టేషన్ కేసుల స్థితిగతులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో ప్రజలకు పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ లు నిర్వహించాలని అన్నారు.మండలంలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్, టేకుమట్ల డి. సుధాకర్, సి సి ఫసియుద్దిన్ పాల్గొన్నారు.
భూపాలపల్లి లో గంజాయి కేసులో నలుగురు అరెస్టు
గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను భూపాలపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు భూపాలపల్లి సిఐ నరేష్ తెలిపారు. భూపాలపల్లి బాంబులగడ్డ శివారులో పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త తనిఖీలు చేస్తుండగా నలుగురు నిందితులను పట్టుకోగా ఒక వ్యక్తి పరారయ్యాడు. దేవర కిషోర్, కీసర పవన్, తుటి విజయ్, సాయి ప్రకాష్ లను అరెస్ట్ చేశారు.మోకిడి అజయ్ పరారీ లో ఉన్నాడు. నిందితుల నుండి 3 కిలోల 135 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం వేసుకున్నట్లు భూపాలపల్లి పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుండి పట్టుకున్న గంజాయి సుమారు రూ. 1.56 లక్షలు ధర ఉంటుందని, ఈ గంజాయిని ఒరిస్సా నుండి తీసుకువచ్చి భూపాలపల్లి పరిసరాల్లో విక్రయిస్తున్నారని సిఐ నరేష్ తెలిపారు.ఈ ఘటనపై ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు. గంజాయి మరియు ఇతర నిషేదిత పదార్థాలు వాడిన, విక్రయించిన చర్యలు తీసుకుంటామని , ఎవరికైనా గంజాయి సంబందిత సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భూపాలపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ డి. నరేశ్ కుమార్ తెలిపారు.