ఎన్ ఎస్ ఎస్ యూత్ ఫెస్టివల్లో బండారుపల్లి విద్యార్థినుల విజయం
ములుగు, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ యూత్ ఫెస్టివల్లో ములుగు మండలంలోని పీఎం శ్రీ బండారుపల్లి మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థినులు యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థినులను రాష్ట్ర మంత్రి సీతక్క పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. పోస్టర్ పెయింటింగ్ పోటీలో పోరిక యువరాణి ప్రథమ బహుమతి, రంగోలి పోటీలో అజ్మీరా హేమలత ప్రథమ బహుమతి, సోలో సాంగ్స్ పోటీలో భూక్యా హేమలత ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి తెలిపారు. ఈ విజయాలకు మార్గదర్శకుడిగా బండారుపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు, ములుగు జిల్లా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ చి. ప్రసన్ కుమార్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విజేతలైన విద్యార్థినులను ఘనంగా అభినందించారు.





