టీటీసీడీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బచ్చు పూర్ణచంద్రరావు
జిల్లా స్థాయి సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 5, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన శ్రీ సత్యదేవా మెడికల్స్ యజమాని బచ్చు పూర్ణచంద్రరావు ది తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (TTCDA) రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని టీసీడీఏ భవన్లో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో హర్షద్వానాల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ములుగు జిల్లా కార్యదర్శిగా యూనియన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నాయకుల ప్రశంసలు అందుకున్న ఆయనకు సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించింది. ప్రమాణ స్వీకరణ అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మృత్యుంజయ రెడ్డి పట్టు శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. నూతన సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావుకు వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు ములుగు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు అభినందనలు తెలిపారు.









