ఆదివాసీ నవనిర్మాణ సేన సౌజన్యంతో రైతులకు అవగాహన సదస్సు
వెంకటాపురం, ఆగస్టు2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల రైతుల కోసం ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్‌ఎస్) సౌజన్యంతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఒంటిమామిడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ వరి, మిర్చి, మొక్కజొన్న పంటలలో సరైన నీటి యాజమాన్య విధానాలు పాటించాలని సూచించారు. ముదురు నారు వాడితే అదనంగా ఎరువులు అవసరమవుతాయని తెలిపారు. కీటక శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న మాట్లాడుతూ పురుగులను నియంత్రించేందుకు పక్షులు సహకరిస్తాయని, చేల్లో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విభాగ అధికారి అవినాష్ వర్మ మాట్లాడుతూ ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు వాసం నాగరాజుల కృషి వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని చెప్పారు. ప్రతి ఏటా రైతులకు శిక్షణ అవసరమని, మెలుకువలు నేర్పాలని పేర్కొన్నారు. క్రిస్టల్ కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, శ్రీనివాస్, రవి మాట్లాడుతూ తమ ఎరువులు, పురుగుమందులు వాడితే అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో రైతులు రాంబాబు, ప్రవీణ్ సహా సుమారు 250 మంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆదివాసీ నవనిర్మాణ సేనకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.