యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థు లకు అవగాహన కల్పించేందుకు భూపాలపల్లి జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ వంటి అనుచిత చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ నిషేధానికి సంబంధించిన చట్టాల ప్రకారం ఇది శిక్షార్హ నేరమని, ఇందులో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే వైద్యులుగా ఎదగాల్సిన బాధ్యత ఉన్నదని, పరస్పర గౌరవం, సహకారం, స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారని పేర్కొంటూ, కాలేజీలో సురక్షితమైన విద్యా వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లయితే లేదా అలాంటి ఘటనలు గమనించినా వెంటనే కాలేజీ యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అవసరమైతే యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ 1800-180-5522 లేదా డయల్ 100 ను వినియోగించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ కే. రాజేష్ (అడ్మినిస్ట్రేషన్), డా. బి. శ్రీధర్ రావు (అకాడమిక్), అధ్యాపకులు, పోలీస్ అధికారులు మరియు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.






