తాడ్వాయి జర్నలిస్టుపై దాడి హేయనీయం
– విలేఖరి పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి
– కలెక్టరేట్ ఎదుట ధర్నా వినతి పత్రం అందజేత
ములుగు ప్రతినిధి, జూన్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీకాంత్ రెడ్డి పై కొందరు రాజకీయ నాయకులు దాడి చేయడం ఖండనీయమని, పోలీసు అధికారులు దోషులను గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ములుగు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలపై జర్నలిస్టు శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి పత్రికలో పలు దఫాలుగా వార్తా కథనాలు ప్రచురించడంతో ఈ దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురు వ్యక్తులు కారులోకి లాగి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నం చేయడం దారుణం అన్నారు. ప్రజలకు మంచి చేసే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ఖండించదగ్గ విషయమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం పోలీసు శాఖ తీవ్రంగా పర్యటించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు ఎండి షఫీ అహ్మద్, దూడ బోయిన రాకేష్, పిట్టల మధుసూదన్, సుంకరి సంపత్, గాదం దేవేందర్, గుర్రం శ్రీధర్, బైక్ అని నటరాజ్, భిక్కనూరు సుమన్, సతీష్ గౌడ్, పోలోజు రామ్మూర్తి, గండ్రకోట విష్ణుకుమార్, బానోతు వెంకన్న, సంగా రంజిత్, బైకాని వేణు, గున్నాల తిరుమలరెడ్డి, దిశా సుమన్, ఆవుల వెంకన్న, కొండి మహిపాల్, గజ్జి రాజేష్, జినుకల ప్రభాకర్, చల్లగురువుల రాజు, హరీష్, మాట్ల సంపత్, రాజు, గోల్కొండ రాజు, ముకులోతు శరత్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.