పేరూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
వెంకటాపురం, జూలై 21, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సర్కిల్ పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సెక్యూరిటీ, సిబ్బంది విధులు, భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ ప్రాంత యువత మత్తు పదార్థాలపై ఆకర్షితులు కాకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టేకులగూడెం వద్ద గోదావరి వరదల సమయంలో తరచూ ముంపు కిగురవుతున్న రేగు మాకు వంతెనను పరిశీలించిన ఏఎస్పీ, వరదల సమయంలో జాతీయ రహదారిపై రవాణా నిలిచిపోతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.