మంత్రుల పర్యటన విజయవంతానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
– భూపాలపల్లి ఎమ్మెల్యే జిఎస్‌ఆర్
భూపాలపల్లి, జూలై 19,తెలంగాణ జ్యోతి : ఈ నెల 21 న భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు పర్యటించ నున్నట్లు, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గోరి కొత్తపల్లిలో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం, గణపురంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం, చెల్పూర్ బస్ స్టాండ్, గ్రంథాలయ భవనం, టాస్క్ ఆధ్వర్యంలో యూత్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమాలన్నిం టికీ సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ రెండు పడకగదుల ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి కార్యక్రమం సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మీ, పీఆర్‌ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.