ములుగులో రావణాసుర వధకు ఏర్పాట్లు పూర్తి
– 25ఏళ్లుగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు
– హాజరుకానున్న రాధామనోహర్ దాస్ స్వామీజీ
ములుగు ప్రతినిధి, అక్టోబర్1, తెలంగాణ జ్యోతి : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగులో ధర్మ జాగరణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే రావణాసుర వధకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తుండగా ఈ వేడుకల్లో సిల్వర్ జుబ్లీ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా ఏదో ఒక కొత్త ఆలోచనతో ప్రజలు, భక్తులకు మంచి తత్వం అందించే లక్ష్యంతో ఈ వేడుకలు చేపడుతున్నారు. 25ఏళ్ల క్రితం ప్రతీ దసరాకు సమూహాలు, వర్గాల మధ్య గొడవలు జరిగేవని, రావణాసురవధ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు దసరా రోజు గొడవలు తగ్గినట్లు పలువురు వాపోతున్నారు. గురువారం ములుగులోని సాధన ఉన్నత పాఠశాల ఆవరణలో సాయంత్రం జరిగే రావణాసురవధ కార్యక్రమానికి భగవత్ గీత ప్రచారకులు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ హాజరు కానున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. ఈ వేడుకల్లో మల్లెపందిరి, ఫైర్ వర్క్స్, నాగుపాము బుసలు కొట్టుట, శాస్త్రీయ, జానపద నృత్యాలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు ఆహ్లాదాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. గతంలో పలువురు పారిశుధ్య కార్మికులు, ములుగు జిల్లా సాధన ఉద్యమకారులు, వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యులను సన్మానించగా ఈ సారి సమాజహితం కోసం పాటుపడుతన్న వారిని గుర్తించి వారికి సన్మానం చేయనున్నామని కుమార్ తెలిపారు. సుమారు 8వేల మంది హాజరవుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించే ఈ రావణాసురవధ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజేందర్, రాజ్ కుమార్, సురేష్, రమేష్, శివాజీ, రాజు, తదితరులు పాల్గొన్నారు.