మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు
– డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు : ఎస్‌ఐ వెంకటేష్ హెచ్చరిక
హెల్మెట్ లేకపోతే జరిమానా, వాహనాల సీజ్
కన్నాయిగూడెం, జూన్ 23, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం కన్నాయిగూడెం మండల కేంద్రంలో స్థానిక ఎస్‌ఐ ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా “అభయమిత్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అభయమిత్ర” ఓ ప్రజాభిముఖ పోలీస్ కార్యక్రమమని ప్రజలకు భద్రతాభావం కల్పిస్తూ వారి సమస్యలకు సహాయపడే నిమిత్తం ఇది అమలులోకి తీసుకొచ్చినదని తెలిపారు. మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంతో జీవితం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని, యువత తమ భవిష్యత్తు నాశనం చేసు కోవద్దని హెచ్చరించారు. డ్రగ్స్ దూరంగా ఉంచాలన్న సంకల్పం తో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే రోడ్డు భద్రతపై అప్రమత్తం చేస్తూ – ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 4గురు వాహన దారులకు రూ.2400 జరిమాన విధించినట్టు తెలిపారు. అనంతరం స్థానిక క్రీడాకారులకు వాలీబాల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.