మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన
వెంకటాపురం, సెప్టెంబర్30, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడువీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంగళరావుపేట గ్రామంలో మానవత్వాన్నే ప్రశ్నించే సంఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లడానికి కనీస రహదారి లేకపోవడంతో మృత దేహాన్ని గ్రామస్తులు నడుము లోతు నీళ్లలో, బురదలో మోస్తూ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు అడుగుల బురదలో మృతదేహాన్ని మోసుకెళ్లిన ఆదృశ్యం గ్రామ ప్రజల హృదయాల ను కదిలించింది. వర్షాల కారణంగా మార్గం పూర్తిగా మునిగి, వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. అనేకసార్లు పంచాయతీ, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా ఎలాంటి చర్యలు లేక పోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి గమ్యం అయిన స్మశాన వాటికకూ చేరలేని స్థితి – మానవత్వానికి తగినదేనా.? అని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే స్మశాన వాటికకు పక్కా రహదారి నిర్మించాలని, తాత్కాలికంగా నైనా దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.